అవధాన సహస్రఫణి స్తుతి!


కమ్మని పద్యమాధురులు కంఠమువెల్వడ గ్రోలినామహో !
కమ్మని భోజనమ్ములను గారవమొప్ప భుజించినామహో !
అమ్మయొడిన్ జెలంగి శిశువైనటు పల్కులతల్లి సన్నిధిన్ 
కమ్మని పల్కులన్ విని వికాసమునొందితి మాత్మకింపుగన్ !

మాడుగులాన్వవాయ కవిమాన్యుని నాగఫణీంద్రు జేరగా 
వాడని పద్యమాలికలు వన్నెలుదీరుచు కంఠమందునన్ 
వీడని భూషణమ్ములయి బ్రీతిగ నిల్చివెలుంగు చెల్మితో 
వీడవు దీర్ఘకాలము నవేద్యమనోజ్ఞమయానుభూతులన్  

అవధానసరస్వతికై 
యవధానసహస్రమాలలర్పించిన మా 
యవధానికవీశ్వరునికి 
నవధులు లేకుండ వచ్చు నభ్యుదయంబుల్!

గానము మనోహరంబై 
న్యూనము గానట్టి ప్రతిభ నూత్నవరంబై 
మా నాగఫణికవీంద్రుని 
నానావిధధిషణ వెలుగు నవనవమగుచున్!

ఎల్లరి మనముల  గెలిచిన 
హృల్లాస్యవచోవిలాసరీతి వెలుంగన్ 
ఎల్లలు లేని యశస్సుల 
కిల్లగు నీ ప్రతిభ గొలుతు హే కవిచంద్రా!


అభినందనలతో.....
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. 
15.4.2019.
Next
This is the most recent post.
Previous
Older Post

0 comments:

Post a Comment

 
Avadhana Saraswathi Peetham - అవధాన సరస్వతీ పీఠం © 2018. All Rights Reserved.
Top